సందీప్ కిషన్ హీరోగా అంటే ఒక తరహాలో కథలు ఎంచుకుంటుంటాడు. అందులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం పెండ్లి నేపథ్యంలో సాగుతుంది. ఆద్యంతం ఎంటర్‌టైన్ చేయడంతో ఆకట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రం 'జోరు' చెత్తగా వుంది. అందుకే మరలా ఎక్స్‌ప్రెస్ లాంటి కథనే హీరో నమ్ముకున్నాడు. పదేళ్ళనాడు 'చిన్నోడు' అంటూ సుమంత్‌తో చేసిన కన్మణి టేకింగ్ బాగుందనే టాక్ వచ్చినా ఎందుకనో ప్రేక్షకులు చూడలేకపోయారు. ఆ తర్వాత మరో సినిమా తీశాడు. అదీ నిరాశ పర్చింది. తాజాగా ఉషాకిరణ్ మూవీస్ వంటి పెద్ద సంస్థతో చేశాడు. మరి ఏం చెప్పాడో చూద్దాం.
కథ :
కొత్త ఫర్నిచర్స్ కొనుక్కున్న ఓ మోడ్రన్ అమ్మాయి తన సామాగ్రిలోని బీరువాలో సంజయ్(సందీప్‌కిషన్)ని చూసి షాక్ అవుతుంది. తను దొంగను కాదని.. తన ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు. చిన్నతనంలోనే అల్లరి బాగా చేసి తల్లిదండ్రుల్ని ఆటపట్టిస్తుంటాడు. తండ్రి సీనియర్ నరేష్ ఓ బిజినెస్‌మేన్. తండ్రి కొట్టినప్పుడల్లా బీరువాలో దాక్కుని ఎంజాయ్ చేస్తుంటాడు. తండ్రి వ్యాపారంలో మేనేజర్ మోసం చేస్తే అతన్ని పట్టుకునేందుకు విజయవాడలో దందాలు చేసే ఆదికేశవులు (ముఖేష్‌రుషి) సాయం కోసం ఇద్దరు అతని ఇంటికి వస్తారు.
అక్కడ ఆయన కుమార్తె స్వాతి(సురభి)ని చూసి ప్రేమించేస్తాడు. ఆ తర్వాత తాము వచ్చిన పని పూర్తయి వెళ్ళిపోతుంటే.. స్వాతి కూడా వారికి తెలీకుండా కారు డిక్కీలో వచ్చేస్తుంది. ఇంతకీ ఆమె ఎందుకు అలా వచ్చింది. సాహసం చేయడానికి కారణం ఏమిటి? అనేది కథ.
నటీనటులు :
సందీప్ కిషన్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథే. అయితే గత చిత్రాలన్నింటిలో తను ఎలా చేశాడో ఇందులోనూ అలానే చేశాడు. ఎక్కడా కొత్తదనం కన్పించదు. మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ కూడా అలానే వుంటుంది. సురభి కొత్తమ్మాయి. నటించడానికి పెద్దగా అవకాశం లేకపోయినా వున్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. ముఖేష్‌రుషి పాత్ర చాలా చిత్రాల్లోనూ చూసిందే. సీనియర్ నరేష్ పాత్రకే నటనకు అవకాశాలు ఎక్కువ. కొడుకు పెట్టే చిత్రహింసలకు మథనపడుతూ, ఆనందపడుతూ పలికించే హావభావాలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ టీవీ నటులే.
టెక్నికల్‌గా... థమన్ సంగీతం ఫర్వాలేదు అనిపిస్తుంది. పాటల్లో సాహిత్యం ఓకే. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. రొద ఎక్కువగా వుంటుంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే వున్నాయి. సంభాషణల పరంగా కన్మణి ఉపయోగించుకున్న రచయితలు ప్రాస కోసం పాకులాడకుండా.. చక్కగానే రాశారు. తండ్రి తన స్వార్థం కోసం చూస్తుంటాడే కానీ కన్నకూతురులోని ప్రేమను చూడలేకపోతాడు. ఇదే పాయింట్‌ను రెండు గంటల్లో చెప్పాడు.
విశ్లేషణ
కథ ఎప్పుడూ మామూలుగానే వుంటుంది. ప్రజలను భయభ్రాంతుల్ని చేసే విలన్. ఒకే ఒక్క కూతురు. ఆమెను తనకిష్టంవచ్చిన వాడితోనే పెండ్లి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మరొకరిని ప్రేమిస్తుంది. దాని కోసం ఆ కుర్రాడు ఎంతకు తెగించాడు అన్నది కథ. వేల కథలు వచ్చాయి. దాని కోసం మొదటి భాగం సరదాగా చూపించేసి.. సెకండాఫ్‌లో హీరో ఏం చేస్తాడనేది దర్శకుడు చెప్పదలచింది. హీరో విలన్ కన్‌ఫ్యూజ్ చేస్తూ రకరకాల జిమ్మిక్కులతో సినిమాను తన భుజాలపై వేసుకోవడం ఇప్పటి యూత్ హీరోలు చేసేదే. అదే ఫార్ములా సందీప్ కిషన్ చేశాడు.
కొన్నిచోట్ల పేరున్న దర్శకులు ఫార్మెట్‌ను కూడా వాడుకున్నాడు దర్శకుడు. అయితే బీరువా కాన్సెప్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది. మిగతావన్నీ పాత వాసనలే. నవ్వించడానికి ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా సప్తగిరి చేసే విన్యాసాలు చిత్రాన్ని కాస్త నిలబెడతాయి. అలాగే షలకల శంకర్ వంటవాడి పాత్రగా మెప్పిస్తాడు. వీరిద్దరి పాత్రలు లేకపోతే సినిమా చాలా చప్పగా వుంటుంది.
కాగా, నిర్మాణపరంగా చాలా సింపుల్‌గా ఈ చిత్రాన్ని తీశారు. కేవలం రామోజీ ఫిలింసిటీ లోనే చిత్రాన్నంతా చుట్టేశారు. ఛేజింగ్‌కు సిటీకి రావాలని హైటెక్స్ దగ్గర ఫ్లైఓవర్‌ను మాత్రమే వాడుకున్నారు. చాలా సింపుల్‌గా తీసిన ఈ చిత్రం నాలుగు రోజులు ఆడినా సేఫ్‌గా వుంటుందనే నిర్మాణంలో కన్పిస్తుంది. ఇంతకుమించి ఈ చిత్రం గురించి చెప్పాల్సిందేమీలేదు.