Sunday 15 August 2010

ఒక వల - ఏడు పార్టీలు




సండే కామెంట్ఒక వల - ఏడు పార్టీలు
అనగనగా ఏడు పార్టీలు.ఏడు పార్టీలూ ఓట్ల వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చుకుని ఎండబెట్టుకున్నాయి.అన్నీ ఒక సైజువి కాదు కనక ఒకేసారి ఎండలేదు. ముందుగా పెద్ద చేప ఎండడంతో ఆ చేపను వలేసి పట్టిన రాజు దాన్ని కోసి తన వాళ్లందరికీ చిన్నా పెద్దా ముక్కలు పంచిపెట్టాడు.ఇంతలో రాజు చనిపోయి మరో రాజు సింహాసనాన్ని అధిష్టించాడు.ముక్కలు ఇచ్చిన రాజుకే విధేయంగా ఉంటామని వాటిని తీసుకున్న వాళ్లు మొండికేసి కొత్త రాజును ముప్పుతిప్పలు పెట్టసాగారు.ఇచ్చిందెవరైతేనేం? బొక్కసంలో నుంచి వచ్చిన డబ్బుతోనే కదా వలను కుట్టించింది. దాన్ని విసిరిందీ, దానితో అతి పెద్ద చేపను పట్టిందీ కూడా రాజరికపు సొమ్ముతోనేనాయె. మీరు విధేయంగా ఉండాల్సింది వలకు కాని, వల విసిరిన వాళ్లకు కాదు కదా అని కొత్త రాజు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు.వాళ్లు... వింటేనా!వల గొప్పతనం గురించి నువ్వు మాకు కొత్తగా చెప్పనక్కర్లేదు. వలలు పేనీపేనీ పైకొచ్చిన వాళ్లమే మేమూ. లేకపోతే చేపముక్కలు మాదాకా ఎలా వచ్చేవి? ఆకర్షణీయమైన అతి పెద్దవల నేయడం అందరికీ చేతకాదు. నీకు అసలే రాదు. అందుకే మళ్లీ వేటకెళ్లినపుడు నువ్వొక్క చేపా తేలేవని మా అనుమానం... అన్నారు వాళ్లు.నిజమే. మీకందరికీ సరిపడేంత పెద్ద చేపను వలేసి పట్టే శక్తి నాకు లేదు. కాని ఇప్పటికే మీరు మింగిన చేపముక్కల్లో ఉన్న ముళ్లు మీ కడుపుకు గుచ్చుకునేలా మాత్రం చేయగలను. ఆ ముళ్లు మీరు పీక్కునేదాకా నేను నిశ్చింతగా రాజ్యం ఏలవచ్చును... అనుకున్నాడు కొత్త రాజు.మిగతా ఆరు పార్టీలూ ఈ చోద్యం చూస్తూ నిలబడి ఉండగా వాళ్లు ఎండబెట్టిన ఆరు చిన్నాచితకా చేపల్లో ఎక్కువ భాగం మళ్లీ నీళ్లలోకి జారుకోవడం మొదలుపెట్టాయి.వచ్చేసారి చేపల్ని పట్టడం మరింత కష్టమయ్యేలా ఉందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి నిట్టూర్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు