ఒక షార్కూ ... తాజా చేపలూ
జపాన్ వాళ్లకు చేపలంటే భలే ఇష్టం. చుట్టూ సముద్రమే కాబట్టి వాళ్లకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేపలే దొరుకుతుండేవి ఇన్నాళ్లూ. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
దగ్గరి సముద్ర జలాల్లో చేపలు దొరకడం మానేసాయి. కాలుష్యమో థర్మల్ ప్లాంట్లో ఏదో కారణమన్నారు.
మత్స్యకారులు చేపల కోసం దూరం వెళ్లాల్సి వచ్చింది. చిన్న పడవలు సరిపోక పెద్దవి చేయించుకున్నారు.
అక్కడ చేపలైతే దొరికాయి. కాని అంత దూరం నుండి తెచ్చేసరికి తాజాతనం ఉండక జనం కొనలేదు.
ఫిషింగ్ కంపెనీలు రంగప్రవేశం చేసి తమ పడవలకు ఫ్రీజర్లు అమర్చుకున్నాయి. దాంట్లో చేప్చల్ని భద్రపరిచి తెచ్చి అమ్మినా జనం కొనలేదు. ఎందుకంటే ఫ్రోజెన్ చేపలు నచ్చలేదు వాళ్లకు. దాంతో ఆ చేపల్ని తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చేది. ఈసారి కంపెనీల వాళ్లు పడవల్లోనే నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసుకుని వాటిల్లో చేపలు వేసి తీసుకురాసాగారు. అయితే వాటిల్లో ఈదడానికి కాదు కదా కదలడానికి కూడా చోటు ఉండకపోవడంతో చేపలు మందకొడిగా తయారై తాజాదనం కోల్పోయేవి. జపాన్‌వాళ్లకు వాటి రుచీ నచ్చలేదు. అప్పుడు కంపెనీలు ఏం చేశాయో తెలుసా! ఆ ట్యాంకుల్లో మామూలు చేపలతో పాటు ఒక షార్క్ చేపనీ వేయసాగాయి. షార్క్ సంగతి తెలుసుగా మీకు? చేపలే దాని ఆహారం. షార్క్‌లు చేపల్ని తినేస్తే మరి వాళ్లకు ఏమిటి లాభం అనకండి. ఉంది. షార్క్ నుంచి తప్పించుకోవడానికి చేపలు ఆ ట్యాంకుల్లోనే చురుకుగా తిరుగుతూ ఉంటాయి కదా. వాళ్లకు కావల్సింది అదే. కొన్ని చేపలు పోతేనేం జనానికి మార్కెట్‌లో తాజాచేపలు దొరుకుతాయి. అబ్బ జనమంటే ఎంత ప్రేమ కంపెనీల వారికి అనుకోకండి. తాజాచేపల్ని ఎంతకైనా కొనే జనం అభిరుచి పట్లే వారి ప్రేమంతా.
నీతి : 1. శత్రువు ఉన్నప్పుడే మనం చురుగ్గా ఉంటాం.
2. జనానికి ఏది ఇష్టమైతే ముందుగా దాన్ని దూరం చేసి తర్వాత ఎక్కువ రేటు పెట్టి అమ్మాలి.