Tuesday, 20 January 2015

అనుమానాస్పద ఫేస్ బుక్

హైదరాబాద్ : ఉగ్రవాద కార్యకలాపాలపై శిక్షణ పొందేందుకు సరియా వెళ్తూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నగరానికి చెందిన సల్మాన్ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో ఇంటలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. పాతబస్తీలోని హబీబ్‌నగర్‌కు చెందిన సల్మాన్ మోహినుద్దీన్‌కు సిరియాకు చెందిన అయేష అనే యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ఉగ్రవాదం వైపు ఆకర్శించిన విషయం తెలిసిందే.
సల్మాన్ రోజూ అయోషాతో ఫేస్‌బుక్ ద్వారా తరచూ చాటింగ్ చేసేవాడు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యాచరణ, కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు, టెక్ట్స్ ఫైల్స్‌ను షేర్ చేసుకున్నారు. సల్మాన్ తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఉగ్రవాద సంస్థలు నగర యువకులను ఆకర్శించేందుకు యత్నిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు గ్రహించాయి.
ఈ మేరకు నిఘా వర్గాలు నగర పోలీసులతో పాటు ఐబీ ఐటీ, సీఐ సెల్ విభాగాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశాయి. ఉగ్రవాద శిక్షణ సంస్థలున్న సిరియా, ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి వచ్చే ఫేస్‌బుక్ మెసేజ్‌లపై నిఘా పెట్టేందుకు ఐబీ వర్గాలు రంగం సిద్దం చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన యువతను రెచ్చగొట్టే, ప్రభావితం చేసే, ఆకర్శించే విధంగా నినాదాలు, మతోన్మాదానికి సంబంధించిన వ్యాసాలు, కామెంట్స్, వ్యాఖ్యలను చేరవేసే ఫేస్‌బుక్‌లపై దృష్టి పెట్టనున్నారు. వీరితో పాటు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన ఫేస్‌బుక్‌లు, ఈమెయిల్స్‌పై కూడా ఆరా తీస్తున్నారు.
ఇక ఉగ్రవాద కార్యకలాపాలను ఫేస్‌బుక్‌ద్వారా ప్రచారం చేసే ఏజెంట్లు, నిందితులను గుర్తించి వారి నుంచి వచ్చే ఫేస్‌బుక్ మెసేజ్‌లు, కామెంట్లు, నినాదాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు నిఘా వర్గాలు సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులను రంగంలోకి దింపారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ఐటీ నిపుణుల సహకారం అత్యంత కీలకంగా మారనుంది.

Popular Posts