Wednesday 24 December 2014

దేవుడికే దడ పుట్టింది!

స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు.

ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు.
చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ.

పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు.

మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు.

తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయాయ్ దేవుడికి.

స్వర్గ లొకంలొ జరిగే ఫిలిం ఫెస్టివల్ కు మంచి సినిమాలు సెలెక్ట్ చెయ్యాలి, పేపర్లలో వెతుక్కుని ,థియేటర్లకు వెళ్ళి చూస్తూకూర్చుంటే జరిగే పని కాదని, ఒక వీడియో పార్లర్ కు వెళ్ళి ఓ 200 సినిమాలు అద్దెకు తీసుకుని ఎడా పెడా చూసేసాడు.

అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. సినిమాలన్నీ చూసాక దేవుడికి ఏమి చెయ్యాలో తోచలా...తను చూసిన ఆ రెండొందల సినిమాలలో ఓ ఐదు సినిమాలు తప్ప మిగిలినవన్నీ చెత్తా చెదారం....'యూత్ ','ఫాక్షన్ ' ట్రెండ్ల పేరిట వచ్చిన ఎన్నో నికృష్టమైన సినిమాలు చూసాడు పాపం.

ఈ రెణ్ణెల్ల మెదడు వాపు కార్యక్రమం తరువాత ఓ రోజు న్యూస్ పేపర్ తెరిస్తే అందులో "తెలుగు నిర్మాతల సంఘం అనువాద చిత్రాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది" అని ఉంది.

అంతే...తెలుగు దేవుడికి చిర్రెత్తుకొచ్చింది , తన శక్తులన్నీ ఉపయోగించి తెలుగు సినిమా ఇండస్ట్రి వాళ్ళనందరినీ రవీంద్ర భారతికి రప్పించాడు..

మన సినిమా హీరొల స్టైల్లొనే కొంచెం అతి ఆవేశంతొ మొదలెట్టాడు దేవుడు - "రేయ్ మూర్ఖుల్లారా....మన సినిమాలు ఆడాలంటే డబ్బింగ్ సినిమాలను నిషేదించటం కాదు మార్గం...పిచ్చి పిచ్చి 'ట్రెండ్ ' సినిమాలు తియ్యకుండా.. కాస్త బుర్ర పెట్టి ఎంటర్టైనింగ్ గా తీయండి, అప్పుడు ఎందుకు చూడరు మీ సినిమాలు జనాలు?"

ఆగి, పక్కనున్న గ్లాసు లొంచి గట గటా నీళ్ళు తాగేసాడు.

మూతి తుడ్చుకుని, " 'సూపర్ కుర్రాళ్ళు - the youth guys ' అనే సినిమా తీసిన గాడిద ఎవడు...ముందుకు రా రా..." పిలిచాడు దేవుడు
"ఆ సినిమా రిలీజ్ చేసేముందు ఒక్క సారైన చూసావా దాన్ని?" .

ఆ దర్శకుడు "చూడండి సార్..ఇప్పుడు యూత్ ట్రెండ్ నడుస్తోంది...మీకు అర్థం కాదు..." అని ఇంకా ఏదో అనబోతుండగా...

" 'యూత్ ట్రెండ్' ఎంట్రా నీ మన్ను...ఏమాత్రం నటించలేని ఓ నలుగురిని తీసుకొచ్చి..వాళ్ళకు ఒకే రంగు బాగులు తగిలించి.. ఈ భూప్రపంచం లో యే కాలేజిలోనూ జరిగే అవకాశమే లేని 'క్లాసు రూము ' సన్నివేశాలు ఓ పది తీసి...సినిమా లో ఉండే విషయానికి ఏమాత్రం సంబంధం లేని టైటిల్ పెట్టి...అంతకన్నా దరిద్రమైన కాప్షన్ ఒకటి తగిలించి సినిమా రిలీజ్ చేస్తే....థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ కూడా చూడడురా దాన్ని"

ఆ మాటలకు ముందు వరసలో కూర్చున్న సీనియర్ నిర్మాతల్లో ఒకరు "బాగా చెప్పారు...అస్సలు ఈ కొత్తవాళ్ళకు సమాజం పట్ల బాధ్యత లేకుండా పోతోంది.....సినిమా తీసెటప్పుడు స్క్రిప్టు పక్కాగా తయారు చేసుకుని వెళ్ళాలి..సీనియర్ రచయితల, దర్శకుల పర్యవేక్షణ లో తియ్యండయ్యా సినిమాలు" అన్నాడు.

దేవుడు ఆ నిర్మాత వైపు చూసి...."ఓ! మీరా సార్, మీ సినిమాలు కూడ ఓ నాలుగైదు చూసాను మొన్న ....వాళ్ళు తీసే సినిమాలు పనికిమాలినవైనా కనీసం కొత్త రకం చెత్త తీస్తున్నారు....మరి మీ సంగతి???? పాతికేళ్ళ నాటి కథలు, ముప్ఫై ఏళ్ళ నాటి డైలాగులు... రాసినవే మళ్ళీ మళ్ళీ రాసి, అతిశయోక్తి లేకుండా అర వాక్యం కూడ రాయలేని రచయితల్ని పెట్టుకుని సినిమాలు తీసేస్తున్నారే .. కొత్త కథలు, మంచి సంభాషణలు ఎక్కడి నుండి వస్తాయి భీష్ముడు గారూ??

" 'ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా ' అని లేబిల్ తగిలించడం.అదే సినిమాలో అస్సలు అవసరం లేని బూతు పాటలు పెట్టడం, పరమ రిగ్రెస్సివ్ సన్నివేశాలు, డైలాగులతో సినిమాను రెండున్నర గంటల నిడివి నింపేయడం...

" 'ఇది కళ కాదు పెంకులూ కాదు, మేము కేవలం డబ్బు కోసం తీస్తున్నాము ' అని మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ రెండు రోజులకొకసారి..."మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న సినిమా తీసాము...దీనికి 'ఉత్తమ చిత్రం ' అవార్డు రాకుంటే ఊరుకునేది లేదు "...అంటూ వాగుతూంటారే...మీకు అంతరాత్మ అనేది ఉందా..?
మీ లాంటి వాళ్ళను ఒక చీకటి గదిలో బంధించి 'దోమ కుడితె చికున్ గునియా...ప్రేమ కుడితే సుఖంగునియా ' అనే పాట వినిపించాలి"

ఓ రెండు సెకండ్లు ఏదొ ఆలొచిస్తున్నట్టు బుర్ర గోక్కుని మళ్ళీ ప్రారంభించాడు దేవుడు
"ఆ ఫాక్షన్ సినిమాల రచయితలు,దర్శకులు...ఇప్పుడు మీ వంతు,రండి ఫైకి ...ఆ వచ్చే ముందు...ఒక్కొక్కరు పది గుంజిళ్ళు తీసి రండి....
ఇన్ని 'రాయలసీమ ఫాక్షన్ ' సినిమాలు తీసారే...మీలో ఒక్కరికైన నిజంగా ఆ ఫాక్షనిస్టులు ఎలాగుంటారో తెలుసా??? చేతిలో కత్తులు, గన్నులతో ఎదురెదురుగా నుంచునప్పుడు...టీ లు, కాఫీలు తాగుతూ.. తీరిగ్గా అమ్మలను, అయ్యలను తిట్టుకుంటూ డైలాగులు చెప్పుకుంటార్రా ఎవరైనా??....ఐనా..ఒక్క సినిమాలో హీరో తొడ కొట్టినప్పుడు తెల్ల లుంగీ సందులోంచి చారల డ్రాయర్ కనిపించిందని...వరుసగా ఇరవై సినిమాలలో హీరోకు చారల డ్రాయర్ వేసి నిలబెడితే సినిమాలు హిట్టైపోవు"

"చివరగా మీలో ఉన్న ఇంకో ఆణిముత్యాన్ని పిలుస్తానుండండి" అని... మూలకు కూర్చున్న ఒక దర్శకుడిని పిలిచి "నీ పేరు...నువ్వు తియ్యబొయ్యే సినిమా గురించి అందరికీ చెప్పు" అన్నాడు దేవుడు.

ఆ దర్శకుడు అందరి ముందు నుంచొని "నా పేరు దినకర్...నా సినిమా చాల డిఫరెంట్ గా ఉంటుంది....ఇందులో క్లాస్, మాస్, లేడీస్ సెంటిమెంట్ అండ్ కామెడీ విత్ ఆక్షన్ బాక్డ్రాప్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి" అన్నాడు.

దేవుడు దినకర్ చెవు మెలి పెట్టి..."చూసారా...సినిమా పేరు తో వీడు చేస్తున్న అక్రమాలు....వీడా మన తెలుగు సినిమా భవిష్యత్తు???సంవత్సరానికి రెండు వందల తెలుగు సినిమాలు రిలీజ్ ఐతే...అందులో ఓ పదిహేను సినిమాలైన బాగా ఆడుతున్నాయా??? మిమ్మల్ని ఆర్ట్ సినిమాలు తియ్యమని ఎవ్వరూ అడగట్లేదు...మసాలా సినిమాలైనా మనోరంజకంగా తియ్యొచ్చు...వేరే భాష ల్లోనూ చెత్త సినిమాలు వస్తున్నాయి....కానీ వాళ్ళ మంచి సినిమాలు, ప్రయోగాత్మక సినిమాల శాతం మనకన్నా చాలా ఎక్కువ. అక్కడ బాగా ఆడిన సినిమాలను మన వాళ్ళు చక్కగా డబ్బింగు చేసి వదుల్తున్నారు....
అయితే, మూస వెధవల్లారా....ఒక్క డబ్బింగు సినిమా హిట్ అయ్యిందని...అరవం లో అడ్రస్సు లేని హీరోల సినిమాలు కూడా అనువదించి జనాల మీదకు తోస్తున్నారు కదరా"

ఇంతలో ఆకాశం లో పెద్ద ఉరుములు....దేవుడు పైకి చూసాడు..

పెద్ద దేవుడు ఆకాశం లో కనిపించి - "నాయనా...రానున్నది కార్తీక పౌర్ణమి...అంతలోపు నువ్వు తిరిగి రాకపొతే....దైవత్వము కోల్పొయ్యి శాశ్వతంగా భూలోకము మీద తెలుగు లో వచ్చే డబ్బింగు సినిమాలు, 'యూత్ ' సినిమాలు చూస్తూ ఉండిపోతావు" అన్నాడు.

దేవుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరితో - "నేను మా లోకానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇంకో సంవత్సరం లో మళ్ళీ వస్తా...అప్పటికైనా మన తెలుగు సినిమాల స్టాండర్డ్ కాస్త పెంచడానికి ప్రయత్నిచండి. జంధ్యాల, విశ్వనాథ్, బాపు, వంశీ లాంటి వాళ్ళు రెగులర్ గా తీసిన టైములో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడున్న దర్శకులలో 'సినిమా' మీద మంచి అవగాహన ఉండి, చక్కటి చిత్రాలు తీసే వాళ్ళు ఓ నలుగురున్నారంతే...ఆ సంఖ్య పెంచండి. మన సినిమాలను వేరే భాషల్లోకి అనువదించే లాగా తియ్యండి..కాదూ, కూడదు అని ఇలాగే చెత్త సినిమాలు తీస్తూ కూర్చుంటే......ఈసారి మీరు జరుపుకోవలసింది 'వజ్రోత్సవాలు ' కాదు...'బూడిదోత్సవాలు ' " అని మాయమైపొయ్యాడు..

"అన్ని తెలుగు సినిమాలు చూసిన ఎఫెక్ట్ వల్ల కాస్త ఓవరాక్షను డైలాగుల్తొ పేలినా మొత్తమ్మీద చాల నిజాలే మాట్లాడాడు ఈ దేవుడు" అనుకున్నాడు ఆ హాల్లొ ఉన్న ఒకే ఒక్క sensible శాల్తీ.

తను ఆ మీటింగుకి మైకు సెట్టు అరేంజ్ చేయటానికొచ్చినతను.

Blog Archive