Tuesday, 12 July 2011

భాషాభిమానం!

"... ఇందుకోసం కూడా తెలుగు భాషను మనలో ప్రతి ఒక్కరం మరింత బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం'' మైకులో ఒక పెద్దాయన గొంతు వినబడుతోంది.
తెలుగు భాష ఔన్నత్యం, ఆవశ్యకతలపై జరుగుతున్న సదస్సు అది. పొద్దున్నించి దేశభాషలందు తెలుగు ఎందుకు లెస్సో (ఇంగ్లీషు లెస్ కాదు) అందరూ చెప్పీ చెప్పీ వినీ వినీ అలిసిపోయి ఉన్నారు. ఇది మధ్యాహ్నం సెషన్. అన్నపూర్ణ లాంటి తెలుగు భోజనం తిని, తెలుగు భుక్తాయాసంతో, తెలుగు నిద్రామైకంలోకి జారుకుంటుండగా ఈ మాటలు వినిపించాయి. ఠక్కున లేచి కూర్చున్నారందరూ.
తెలుగు గొప్పతనం గురించి, తెలుగును బతికించుకోవాల్సిన అవసరం గురించి ఇంతమంది కవులు, కథకులు, పండితులు, భాషావేత్తలు చెప్పని ఏ కొత్త విషయాన్ని ఆయన చెప్పబోతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించారు.

"నేనో రాజకీయ నాయకుడ్ని. నాకు వ్యాకరణం, పద్యం, శైలి, శిల్పం వగైరాల గురించి తెలియదు. కాని తెలుగు భాష మాత్రం ఉండి తీరాలి. వేరే ఏ భాషలోనూ నాకు తిట్లు రావు. అలాగే నేను ఎవర్నయినా పొగడాలన్నా, ఎవరైనా నన్ను పొగడాలన్నా... వీటి అవసరం ప్రతిరోజూ ఉంటూనే ఉంటుంది... తెలుగు భాష నాకూ వాళ్లకీ కూడా వచ్చి ఉండాలి. మా ఇద్దరికి మాత్రమే వస్తే సరిపోదు. నా నియోజకవర్గం ప్రజలకు, మీడియా వాళ్లకు కూడా వచ్చి ఉండాలి. ఢిల్లీ వాళ్లకు, ఇంకా చెప్పాలంటే అమెరికా వాళ్లకు తెలుగు భాష రాకపోవడం వల్ల నాకు ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఒక రాజకీయ నాయకుడ్ని అర్థం చేసుకోవాలంటే అతని భాష తెలిసి ఉండాలి. ఒక భాష సజీవంగా ఉందని చెప్పడానికి ఎవరికైనా ఒక ప్రమాణమే ఉంటుంది. అదెన్ని కొత్త తిట్లను స్వీకరిస్తుందో, ఎన్ని కొత్త ప్రశంసలను సృష్టించుకుంటుందో దానిమీదే ఆ భాష కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ అందుకు దోహదపడాలని నా మనవి''... అనేసి సెలవు తీసుకున్నాడాయన.
కింద కూర్చున్నవాళ్లు యథాప్రకారం చప్పట్లు కొట్టి ఆయనతో పాటే లేచి వెళ్లిపోయారు.

Popular Posts