జోడీ నంబర్ 'X'
ఇవ్వాళ పొద్దున ఆ ప్రశ్న చూసినప్పటినుండి అతనికి మహా ఆనందంగా ఉంది.అలాంటి ప్రశ్నలు తన గురించి కూడా ఎవరైనా అడక్కూడదూ! ఎన్నాళ్ళనుండో కాచుకొని కూర్చున్నాడు అడిగితే చెబుదామని.
తనకీ తన మొహానికీ మ్యాచ్ కావడంలేదని అతను ఏ నాడో డిసైడైపోయాడు.కానీ మా ఇద్దరికీ జోడీ కుదిరిందా అని ఇన్నెళ్ళలో ఒక్కళ్ళుకూడా అడగలేదు.అడిగితే దానిమీద ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే కుదరదనే సమాదానం ఎక్కువమంది నుంచి వస్తే దాన్ని మార్చటానికి ఎవరో ఒకరు ఈపాటికే ముందుకు వచ్చే
వారే!
తనకీ తన మార్కులకీ కూడా ఏ ఏడాదీ మ్యాచ్ అవలేదు.ఆ ప్రశ్న ఎవరైనా అడిగి ఉంటే జనం తన ఆన్సర్ షీట్లు దిద్దిన టీచర్లకు గడ్డి పెట్టి ఉంటే వాళ్ళకా అధికారం తొలగించి ఉంటే,ఈ పాటికి తన ప్రతిభకు రావాల్సిన గుర్తింపు అంతా వచ్చేసి ఏ స్మిత్ సోనియన్ ఇన్స్టిటూట్ లోనో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.
అంతెందుకు తనకీ తన కాలనీ రోడ్డుకీ ఏ మాత్రమైనా మ్యచింగ్ ఉందా!రోడ్డుమీద వేగంగా నడిచే అవకాశం లేక కదూ జీవితంలోనూ వేగంగా నడవడం చేతకాకుండా పోయింది.దీనిమీద ఒపేనియన్ పోలింగ్ జరిపితే ఎంతమంది తనను సమర్దించి ప్రబుత్వం నుంచి భారీ నష్టపరిహారం ఇప్పించి ఉండే వాళ్ళో!
తనకీ తన అమ్మా,నాన్నలకి తనకీ తన ఆస్తికీ,తనకీ తన ఆలోచనలకీ,తనకీ తన ఆచరనకీ,ఎప్పుడైనా జోడీ కుదిరిందా!ఒక్కరైనా దీనిమీద మీడియాలో ప్రశ్నలడిగి జవాబులు రాబట్టి తనలాంటి వాళ్ళ జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారా? వాపోయాడతను.
ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొన్నామద్య ఓ తెలుగు న్యూస్ చానల్ ఓ ప్రముఖ తెలుగు హీరో పెళ్ళి విషయమై వాళ్ళిద్దరికీ జోడీ కుదిరిందా అని తన ప్రేక్షకులని ప్రశ్న అడిగింది.
ఇతరుల జీవితాళ్ళోకి చొచ్చుకొని వెళ్ళి ప్రశ్నలడగటం మానవ లక్షణం కాదేమో...!