ఫిబ్రవరి దేవుడు
దేవుడు ఒకసారి మన భూమిమీదకి రావాలనుకున్నాడు.దేవుడంటే మన అందరి దిక్కూ మొక్కూ అయిన ఆ దేవుడే.అందుకోసం ముందుగానే షెడ్యూల్ ప్రకటించాడు.
ముందుగా మన భారతదేశంలో పర్యటించాలనుకున్నాడు.పెద్ద రాష్ట్రాలయితే రెండు రోజులు,చిన్న రాష్ట్రాలయితే ఒక్క రోజు చొప్పున షెడ్యూల్ ఉంది.ఈ విషయం రహస్యం అయితే ఎవరూ తనను పట్టించుకోరని ముందుగా మీడియా వాళ్ళందరికీ ఈ విషయం లీక్ చేశాడు.మీడియా వాళ్ళు ఈ విషయం గంటకోసారి చొప్పున 24 గంటలూ టాం.టాం. వేశేశారు.
ఫిబ్రవరి 1.అందరూ ఎదురుచూస్తున్నారు ఆ రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది.ముందుగా ఆంద్రప్రదేశ్ లో పర్యటిస్తున్నాడు.అడిగిన వారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నాడు.ఒకాయన మారుతీ 800 కారు అడిగి తీసుకెళ్ళాడు,ఇది తెలిసి వాళ్ళావిడ అతన్ని నానా తిట్లు తిట్టి అంతటి దేవుడు వరాలు ఇస్తుంటే ఏ టాటా ఇన్నోవా కారో అడక్క ఇది ఎందుకు తెచ్చారు?అని తిట్టిపోసింది.ఈ ముత్యాలహారం ఏంచేసుకోను? సాక్షాత్తూ ఆ దేవుడే దిగి వచ్చి మనకు వరాలు ఇస్తుంటే ఏ వజ్రాల హారమో అడక్క ఇది ఎందుకు తెచ్చారు? అని వాళ్ళాయన్ని ఉతికి ఆరేసింది.
ఇలా అసంత్రుప్తితో ఉన్న జనం అంతా తరువాతరోజు దేవుడు వెళ్ళేచోటుకి ముందుగానే చేరుకుంటున్నారు.చివరికి ఈ అసంత్రుప్తి సెగలు దేవున్ని కూడా వదల్లేదు.ఇలా దేవుడు ఎక్కడకు వెళ్ళినా అక్కడ మామూలు జనం కంటే అసంత్రుప్తులే ఎక్కువగా ఉంటున్నారు.దేవుడు తనకు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు తనని తాను తిట్టుకున్నాడు.
ఫిబ్రవరి 28,చివరి రోజు డిల్లీ పర్యటన.ఈ విషయం తెలిసి మన నాయకులందరూ ప్రదానమంత్రి పదవీ,ముఖ్యమంత్రి పదవి,ప్రత్యేక రాష్ట్రం అడగటం కోసం అక్కడకు వెళ్ళారు.ఇది తెలిసి దేవుడు వాళ్ళున్న ప్రదేశం దగ్గరకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు.
నెలకు 30 రోజులున్న అన్ని నెలలు వదిలేసి 28 రోజులున్న ఫిబ్రవరి నెలను ఎంచుకున్నందుకు దేవున్ని అందరూ తిట్టుకున్నారు.
హమ్మయ్యా!వచ్చినపని అయిపోయిందనుకుని దేవుడు మాయమైపోయాడు.కానీ ప్రజల మనస్సులలోనే కొలువై వున్నాడు.
అందరూ వెతుకుతునే వున్నారు దేవుడి కోసం.