Monday, 5 May 2014

జైలు,బెయిలు ...మధ్యలో గజనీ

ఓపెన్ చేయగానే-హీరో గజినీ ఓ మైకు పుచ్చుకుని కనిపిస్తాడు.నవ్వూ ఏడుపూ

కానిది ముఖానికి పులుముకుని లోపలినుండి బయటకి వస్తాడు.కట్ చేస్తే

అదే మైకు పట్టుకుని , అదే ముఖమేసుకుని పక్కనే ఉన్న చెట్టు కింద

అనుచరులతో సమావేశం!'ఈ పరిస్థితి చూస్తే  బాధేస్తుంది'

అంటాడు.అప్పుడే టైటిల్స్ పడతాయి.'అయ్యా సారూ అండ్ పార్టీ  సమర్పించు -

జైలు,బెయిలు ...మధ్యలో గజనీ' అని తెర మీద వస్తుంది.అదే షాట్ లో

పైనుండి పూల వాన కురుస్తుంది.


'అదిరిపోయింది, సెంటిమెంటు ఇంకా గొప్పగా ఉండాలి.సరే ఆ తరవాత కథ

చెప్పూ..'తొందర పెట్టాడు నిర్మాత.

'టైటిల్స్ వస్తుంటే - మన హీరో గజినీ మైకుతో పాటు ఓ చెయ్యి పైకెత్తి

సాగిపోతుంటాడు.అందరినీ బరబరా దగ్గరకు లాక్కుని

ఓదార్చేస్తుంటాడు.టైటిల్స్ కాగానే, ఎన్నికలొచ్చేస్తాయి. అయినా గజినీ

మాట్లాడుతునే ఉంటాడు.'అవినీతిని చూస్తే బాధేస్తుంది.అది లేని

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా' అంటాడు మాటిమాటికీ.

మళ్ళీ మెడను వంచేసి,పక్కకు పడేసి,పదే పదే ఆ మాటలే చెబుతుంటాడు.

జనం ఇక ఆగలేక తట్టుకోలేక అల్లాడిపోతారు.

మగవాళ్ళు చొక్కాలతో , ఆడవాళ్ళు చీర కొంగులతో,

అవి లేని వాళ్ళు పక్కవాళ్ళ రుమాళ్ళతో కళ్ళు తుడుచుకుంటారు.


కళ్ళలోనుంచి పొంగుకొచ్చే నాటిని తుడుచుకుంటూ,ఆ వెంటనే చప్పట్లు

కొట్టేస్తుంటారు. గజినీ అంటాడు-'నేను ఒక్కటే చెప్పదలచుకున్నా.

నేనూ, నా కుటుంబం  విశ్వాసానికి  మారుపేరు,

నా ప్లాన్లు, వాటి తాలూకు కాగితాలు అన్నీ ముందే 'కాగ్'కీ,'సిబిఐ'కీ,'కోర్టు'కీ

ఇస్తా.వాటిలో ఏ లోటూ లేదని చెప్పించాకే అన్నీ అమలుచేస్తా' అంటూ

కళ్ళలోకి రాని నీళ్ళను తుడుచుకుంటాడు.షరామామూలే అందరూ

ఘల్లుమంటారు.కళ్ళలో నీళ్ళు మళ్ళీ వరదలై పారుతాయి.'దొంగ అనేవాడు

ఇక ఉండడు నేనుండగా' అంటాడు చొక్కా చేతులు మడుచుకుంటూ .

అంటూనే చేతిని బలంగా పైకెత్తి కత్తిలా కిందకు దూస్తాడు.అందరూ

మరోసారి భోరుమంటారు.అన్నాడు రచయిత కళ్ళు తుడుచుకుంటూ.


అప్పటికే నిర్మాత ...ఎప్పుడు మొదలుపెట్టాడో కానీ,కేర్‌కేర్‌మని

ఏడుస్తున్నాడు.నిర్మాత కళ్ళలోని నీటిని తుడిచి

కథ కొనసాగించాడు రచయిత ' రాష్ట్రాన్ని సింగపూరు గానో,

వాషింగ్టన్ గానో మార్చేస్తా' అంటాడు గజినీ.జనంలో్‌నుంచి  కొందరు

ఇక ఆగలేక  'అన్నా ఇంకా ఏడిపించకన్నా ,హైదరాబాదు కొళాయిల్లా

మాకళ్ళలోనుంచి నీళ్ళు రావడంలేదన్నా' అంటారు ఏకఖంఠంతో. ..అని

కాస్త ఆగాడు. వచ్చే ఎక్కిళ్ళు ఆపుకుంటూ,కాస్తంత కాఫీ తాగి మళ్ళీ

తాపీగా వినడానికి సిద్ధమయ్యాడు నిర్మాత.

ఇంతలో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి.ఛీ..దీని ** జీవితం,ఎంత ఏడ్చినా ఫలితాలు తిరగబడ్డాయి,దీంతో మన

హీరో చేతిలో మైకుని  దూరంగా విసిరేస్తాడు.చేతులు పైకెత్తి అందరికీ దణ్ణాలెడుతూ నవ్వో

ఏడుపో తెలీయని ముఖంతో అలా అల నడచుకుంటూ 'లోపలికి '

వెళ్ళిపోతాడు.వెళ్తూ వెళ్తూ '2019 లో కచ్చితంగా సాధిస్తా' అంటూ పళ్ళు  నూరతాడు.    



'అశుభం కార్డు పడుతుంది వెరైటీగా' అని ఆపాడు రచయిత.

అంతే ఒక్క క్షణమైనా ఆగలేదు నిర్మాత.వెంటనే సినిమా మొదలుపెట్టి త్వరగా పూర్తిచేశాడు.

సెన్సారువాళ్ళు కూడా బోరున ఏడ్చి 'హారర్ సినిమా ,పెద్దలకు మాత్రమే ' అని సర్టిఫికేట్ ఇచ్చేశారు.

ఓ షరతు పెట్టారు .

పెద్ద వాళ్ళయినా సరే,

ఒక్కరే ఆ సినిమా ...తోడు లేకుండా చూడటానికి వీలులేదని చెప్పేశారు.

సినిమా వంద కేంద్రాలలో రెండొందలు రోజులు ఏడిపించింది.

నిర్మాత ఏడుస్తూనే సినిమాను అవార్డుల కమిటీకి పంపాడు .వాళ్ళూ ఠక్కున అవార్డు ఇచ్చేశారు.


అవార్డు వచ్చినా నిర్మాత ఏడుస్తూనే  ఉన్నాడు.

ఏంటి సార్ , ఇంకా ఏడుస్తున్నారు ?అవార్డొచ్చిందిగా? అడిగాడు రచయిత.

అవార్డుల కమిటీ ఇచ్చిన సర్టిఫికేట్ చూపించాడు

నిర్మాత.అందులో 'ఉత్తమ అపహాస్య చిత్రం - జైలూ,బెయిలూ...మధ్యలో గజినీ' అని ఉంది.

రచయిత ఠక్కున తన చొక్కా చేతులు మడుచుకుని , మెడను పక్కకి

పడేసి ఏడుపు తలదన్నే దానిబాబు ముఖం పెట్టాడు.

లోపలినుండి ఓ మైకు తెచ్చుకున్నాడు.

కూర్చున్న చోటునుండి లేవకుండా, గుక్కపెట్టి ఏడుస్తున్న

నిర్మాతను అమాంతం దగ్గరకి లాక్కుని 'ఓదార్పు ' మొదలెట్టేశాడు.

    

Popular Posts