Saturday 17 September 2011

150 వ సినిమా రహస్యం!

లవ్ పై డిఫరెంట్ సినిమా తీయాలని ఒక డైరెక్టర్ కంకణం కట్టుకున్నాడు.రచయితకి కాకితో కబురంపితే,రెక్కలు కట్టుకుని వాలాడు.
"హీరోయిన్ ని హీరో ప్రేమిస్తాడు.కానీ అది ప్రేమని తెలియదు.హీరోపై హీరోయిన్ కి ఇది.అదేంటో తెలీయదు."చెప్పాడు డైరెక్టర్.
"ఎవరికీ ఏమీ తెలీయక పోవడమే సినిమాకి సగం బలం."అన్నాడు రచయిత.
"ఏమీ తెలీయకపోయినా ముద్దుల వరకూ వస్తారు."
"ముద్దులతో ప్రారంభమైన ప్రతి ప్రేమా చివరికి మిస్టరీగా ముగుస్తుంది."
"హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఒకాయనకి బాగా తెలుసు.ఆయనో ఫిజిక్స్ లెక్చరర్.ఈయన రకరకాల ఉపన్యాసాలతో,ఫ్లాష్ బ్యాక్ లతో సినిమాను ముందుకు నడిపిస్తుంటాడు."

"ఈయనకి వేరేపని లేదా?"
"ప్రేమికులని కలపడమే పని"
"కంటికి కనిపించేదేదీ నిజంకాదనే ఫిలాసఫర్ ఒకాయనుంటాడు.ఈయన విలన్."
"ప్రేమించి పెళ్ళిచేసుకున్న తరువాత లవర్సే విలన్లు.మళ్ళీ వేరే విలన్లు అవసరమా?"
"లాజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు.హీరో లేకపోయినా చూస్తారుకానీ,విలన్లు లేకపోతే చూడరు.మన విలన్ వయసులో ఉన్నప్పుడు ఆరుగురుని ప్రేమించాడు."
"ఆరుగురూ తిరస్కరించారా?"
"అంగీకరించారు అందుకే ఫిలాసఫర్ గా మారి ప్రేమికుల్ని విడదీస్తూ ఉంటాడు."

"కలిపేవాడున్నప్పుడు విడదీసేవాడూ ఉంటాడు.ఇంతకీ సినిమా పేరేంటో?"
"మార్ దో గోలీ.హీరోకి గోలీసోడాలంటే ఇష్టం.రోమ్మ్ లో గోలీసోడాలమ్ముతున్నారని తెలిసి హెలికాఫ్టర్ లోనుంచి పరాచూట్ లో దిగి బ్లాక్స్ తో ఫైట్ చేసి సోడా సాధిస్తాడు."
"సోడా కోసం ఇంత ఎపిసోడా?"
"మంచినీళ్ళకోసం ఈమద్య ఒక హీరో ఎడారి దుమ్ములో దొర్లుతూ ఎడపెడా ఫైటింగ్ చేస్తే జనం 'ఖలేజా' తో చూసారా లేదా?"
"ఒప్పుకుంటా తర్వాత సీన్ నేనుచెబుతా.గోలీసోడా చేత పట్టుకొని పాతిక మంది బ్రిటీష్ దాన్సర్లతో 'సోడా,బీరా,నీకు సరి జోడా మగాడా' అని సాంగ్. "
"రచయిత కథ చెప్పినా చెప్పకపోయినా పాటలూ,ఫైటింగులు చెబితే చాలు.మన సినిమాలో థీమ్మ్ సాంగ్ కూడా ఉంది.హీరో హీరోయిన్లు కనిపించినపుడల్లా 'ప్రేమా, దోమా, చీమా, రామా, భీమా తింటావా ఖీమా' అని పాట."
"హీరో హీరోయిన్లు ప్యారిస్ ఎయిర్ పోర్ట్ లో ఒకరినొకరు చూసుకొనిలండన్ లో దిగుతారు.నైట్ క్లబ్ లో కలుస్తారు.ఇద్దరూ తెలుగు వారనే విషయం వాళ్ళకి తెలీయదు."
"కానీ వాళ్ళు ఎప్పటికైనా తెలుగు మాట్లాడతారనే విషయం ఆడియన్స్ కి తెలుసు"
"అక్కడే మనం వాళ్ళని ఫూల్స్ చేస్తాం.సినిమాలో హీరో చాలాసేపు ఇంగ్లిష్ లో,కాసేపు ఆఫ్గనీ లో మాట్లాడతాడు.ప్రేక్షకులు గోల చేస్తారని అనుమానం వచ్చినపుడు మాత్రం తెలుగులో గొనుగుతాడు."
ఇంతకూ హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా?
"కలుసుకుంటారు,డాన్స్ చేస్తారు.ముద్దులు పెట్టుకుంటారు,విడిపోతారు.అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంటరై ఈ కాలంలో దోమలే తప్ప ప్రేమలు లేవంటాడు.ఒకప్పుడు తన మిత్రుడు రామ్మ్ అనే ఆయన సన అనే అమ్మాయితో మాట్లాడటానికి,కలుసుకోవడానికి ఎన్ని అవస్తలు పడ్డాడో చెబుతాడు."
"ఆ కాలంలో సెల్ ఫోన్ లు లేవు కాబట్టి ఎవడి చావు వాడు చచ్చేవాడు.ఇప్పుడేం ఖర్మ."
"ఈ సెల్ ఫోన్ ల వల్ల ప్రమ గుడ్డిదేకాదు,చెవిటిది కూడా అయిపోయింది."
"ప్రేక్షకులు మూగపోకుండా కథ నడపండి?"
రామ్మ్ కి అప్పడాలంటే ఇష్టమని సన ఒక అర్ధరాత్రి వేయించి మరీ తినిపిస్తుంది.ఇది ప్రేమంటే.."
"కుర్ కురే లాగా కరకర మంటోంది.విలన్ ఎంట్రీ ఎప్పుడు?"
"మన వాడు ఉపవాసాలూ,ఫ్లాష్ బ్యాక్ లూ విని,తనలో పుట్టింది ప్రేమని తెలుసుకొనేలోగా విలన్ వచ్చి కంటికి కనిపించే అప్పడాలు నిజం కాదంటాడు.ప్రేమ వరకూ కలర్ ఫుల్ గా ఉంటుందనీ,పెళ్ళి తరువాత వచ్చే బ్లాక్ అండ్ వైట్ రీల్ తాను చూపిస్తానని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళతాడు."
"రొమాన్స్ లో అంబులెన్స్ ఎందుకో ?"
"అదే క్లైమాక్స్ .ఆస్పత్రి బెడ్ పై బ్యాండేజీతో ఉన్న శాల్తీని చూపి అతడే రామ్మ్ అంటాడు.ఒకప్పుడు అప్పడాలు ప్రేమగా తినిపించిన సన,తర్వాతికాలంలో అప్పడాల కర్రతో చావబాదడం వల్ల ఇలా కోమాలోకి పోయాడని చెబుతాడు.హీరో ఆలోచనలో పడతాడు .దీనికి రెండురకాల ముగింపులిచ్చి దియేటర్ లో వదులుతాం.జనానికి ఏది నచ్చితే దాన్ని కంటిన్యూ చేద్దాం."
కట్ చేస్తే ...?
జనం ఏ ముగింపూ చూడకుండానే సగంలోనే గేట్లుదూకి పారిపోయారు."