Wednesday, 22 September 2010

ఒక శ్రీకాకుళం లెక్క!


సండే కామెంట్
ఒక శ్రీకాకుళం లెక్క

ఎన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీములు తింటే ఒక పిల్లవాడికి మొహం మొత్తుతుంది?
ఎన్ని దెబ్బలు తిన్నాక ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది?
ఎన్ని వృత్తులు నాశనమైతే ఒక డిగ్రీ చేతికి వస్తుంది?
ఎన్ని ప్రశంసలు లభిస్తే ఒక రచయిత సంతృప్తి చెందుతాడు?
ఎన్ని గుంటలు పడితే ఒక రోడ్డును ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపిస్తారు?
ఎన్ని ఫ్లైఓవర్లు కడితే ఒక నగరం తన పేరును మార్చుకుంటుంది?
ఎన్ని ఉద్యమాలు జరిగితే ఒక రాష్ట్రం అవతరిస్తుంది?

ఎంత పని చేశాక ఒక శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది?
ఎంత డబ్బు జేబులో ఉంటే ఒక మనిషికి ధైర్యం వస్తుంది?
ఎంత ప్రయాణం పూర్తయితే గమ్యస్థానం ఏమిటో తెలుస్తుంది?
ఎంత స్తబ్ధత తర్వాత ఒక సమాజం మేలుకుంటుంది?
ఎంత అవినీతి జరిగితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు?
ఎంత మంచితనం జతపడితే ఒక సమాజం బాగుపడుతుంది?

***

ఇలాంటి గణాంకాలు కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఎప్పుడు వస్తారో!

***

ఆ మధ్య శ్రీకాకుళంలో - కోటానుకోట్ల మంది వచ్చినారు బాబూ అని ఒకావిడ చాలా గొప్పగా చెప్పింది.
కోటానుకోట్ల మంది ఏమిటే లక్షలాది లక్షల మంది వచ్చారు అన్నదట రెండో ఆవిడ ఇంకా గొప్పగా.
లక్షలాది లక్షల మంది కాదే వేలాది వేల మంది వచ్చారంది ఇదంతా వింటున్న మూడో ఆవిడ మరింత గొప్పగా.
వాళ్లు లెక్కలు తెలియక అలా అంటున్నారనుకుంటున్నారా?
కాని లెక్కలు తెలిసిన అభివృద్ధి శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి లెక్కలే వేస్తున్నారే!

Popular Posts